ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కన్నుమూత
వారణాసి: ప్రముఖ షెహనాయి విద్వాంసుడు, భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సోమవారం తెల్లవారు జామున కన్ను మూశారు. గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 91 ఏళ్ల బిస్మిల్లాఖాన్‌ను ఈ నెల 17వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. వృద్ధత్వం వల్ల సంక్రమించిన వ్యాధులతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. హెరిటేజ్ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారు జామున 2 గంటల 20 నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. బిస్మిల్లాఖాన్‌కు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దాంతో ఒంటి గంట 45 నిమిషాల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. వైద్యులు కృత్రిమ శ్వాస అందించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. నిజానికి బిస్మిల్లాఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆదివారంనాడు కాస్తా మెరుగుపడింది. ఆయనకు ఘనరూపంలో ఉన్న ఆహారపదార్థాలు కూడా అందజేశారు. ఆయన కోరిక మేరకు ఇంటిలో చేసిన హాల్వా కూడా పెట్టారు. ఆయన తనను పరీక్షిస్తున్న వైద్యుల కోసం రెండు పాటలు కూడా పాడారు. మానవ వనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పంజాబ్ సింగ్ బిస్మిల్లాఖాన్‌ను ఆదివారంనాడు పరామర్శించారు. ఉస్తాద్ మృతి పట్ల బెంగుళూర్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బిస్మిల్లాఖన్ 1916 మార్చి 21వ తేదీన సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. వారణాసిలోని విశ్వనాథ్ ఆలయంలో షెహనాయి వాద్యకారుడు అయిన తన సమీప బంధువులు స్వర్గీయ అలీ బక్ష్ విలాయతు వద్ద శిక్షణ పొందారు. ఆయనను 2001లో భారతరత్న వరించింది. పేరుప్రఖ్యాతులు ఎన్ని వచ్చినా తన మరణం వరకు ప్రయాణానికి ఆయన రిక్షానే వాడారు. బిస్మిల్లాఖాన్ మృతికి కేంద్ర ప్రభుత్వం సోమవారాన్ని సంతాపదినంగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications