రింగ్ రోడ్డుపై న్యాయవిచారణకు వైయస్ నో
హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణలో అవకతవకలపై న్యాయవిచారణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంగీకరించలేదు. సిపియం, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సోమవారం ముఖ్యమంత్రిని కలిసి అవుటర్ రింగ్ రోడ్డుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి త్రోసిపుచ్చారు. అక్రమాలపై నిర్దిష్టమైన ఆరోపణలతో ముందకు వస్తే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటానని మాత్రమే ఆయన హామీ ఇచ్చారు.
న్యాయవిచారణకు ఆదేశించకపోతే తాము ఆందోళనను ఉధృతం చేస్తామని సిపియం, టిడిపి, తెరాస నాయకులు హెచ్చరించారు. పేదలకు నష్టం చేస్తూ ధనవంతులకు మేలు చేసేలా అవుటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని, ఇందులో కొంతమందికి ముడపులు ముట్టాయని పెద్ద యెత్తున ఆరోపణలు వస్తున్నాయని, న్యాయవిచారణ జరిపిస్తే తప్ప అక్రమాలు బయటకు రాబోవని తాము ముఖ్యమంత్రికి చెప్పామని, అయితే విచారణ జరిపిస్తామని చెప్పారే తప్ప న్యాయవిచారణకు అంగీకరించలేదని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు మీడియా ప్రతినిధులతో అన్నారు. హుడా నిర్వహించిన పాత్ర వల్ల పేద రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. రింగ్ రోడ్డు వెడల్పును సగానికి తగ్గించడం వల్ల భూసేకరణ స్థాయి కూడా తగ్గుతుందని సూచించామని, అయినా ముఖ్యమంత్రి వినలేదని టిడిపి నాయకుడు కడియం శ్రీహరి అన్నారు.












Click it and Unblock the Notifications