కేంద్ర మంత్రివర్గంలో సంజీవరెడ్డికి స్థానం?
న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు, కార్మిక నేత సంజీవరెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం వుంది. ఆయనకు కార్మిక శాఖను అప్పగించవచ్చునని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజీనామా చేయడంతో ఆ శాఖ ఖాళీగా వుంది. ప్రస్తుత రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి విదేశాంగ శాఖను అప్పగించే అవకాశం వుంది. ఆయిల్ కుంభకోణంలో చిక్కుకున్న నట్వర్ సింగ్ రాజీనామా చేసినప్పటి నుంచి విదేశాంగ శాఖ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దనే వుంది.
రక్షణ శాఖను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. ఎం. కృష్ణకు లేదా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు లేదా ప్రస్తుత కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం జరిగే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంప్రదింపులు జరిపారు. కన్నడ నటుడు అంబరీష్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెరాస నాయకులు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్రల రాజీనామాలతో, వివాదంలో చిక్కుకున్న రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ యాదవ్ రాజీనామాతో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications