రామోజీ వివరణ సంతృప్తికరంగా లేదు: ఉండవల్లి
న్యూఢిల్లీ: ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు తాను చేసిన ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తాను లేవనెత్తిన అంశాలకు రామోజీరావు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని ఆయన మంగళవారంనాడు అన్నారు. రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శి ఫైనాన్షియర్ నష్టాల్లో వుందని, డిపాజిటర్ల డబ్బుకు ముప్పు ఉందంటూ అరుణ్‌కుమార్ సోమవారంనాడు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి ఫిర్యాదు చేశారు. దీనిపై రామోజీరావు వివరణ ఇచ్చారు. డిపాజిటర్ల సొమ్ముకు తనది పూచీకత్తు అని రామోజీరావు అన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను ఈనాడు గ్రూప్‌నకు చెందిన ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను తాము బయటపెడుతున్నందుననే కక్ష గట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ఆరోపణలు చేశారని ఆయన ఎదురుదాడి చేశారు.
రామోజీరావు ఇచ్చిన వివరణపై ఉండవల్లి అరుణ్‌కుమార్ మంగళవారంనాడు ప్రతిస్పందించారు. తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన రామోజీని సవాల్ చేశారు. మిగతా సంస్థలన్నీ లాభాల్లో ఉంటే మార్గదర్శి ఫైన్సాన్షియర్స్ ఎందుకు నష్టాల్లో వుందని ఆయన ప్రశ్నించారు. ఎంత డబ్బు ఏ సంస్థలో పెట్టుబడిగా వుంటారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాతాదారుల సొమ్ముకు భద్రత లేదు కాబట్టే తాను ముందుకు వచ్చానని ఆయన చెప్పారు. వ్యక్తిగత పూచీకత్తు అంటే బాండ్లకు ఉన్న విలువేమిటని ఆయన అడిగారు. ఈనాడులో తనకు సంబంధించిన కుంభకోణాలేవీ రాలయేదని, అటువంటప్పుడు తనకెందుకు కక్ష వుంటుందని ఆయన అన్నారు. కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు కూడా డిపాజిటర్ల డబ్బుకు తనది పూచీకత్తు అని అంటున్నారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications