స్కూలు బస్సు ఢీకొట్టి మహిళ మృతి: ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాదులోని టోలీచౌక్ లో గల రాయదుర్గం వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూలు బస్సు ఢీకొట్టడంతో గురవారం ఉదయం యాదమ్మ అనే కాంట్రాక్టు కూలీ మరణించింది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రోడ్డును దాటుతుండగా యాదమ్మను బస్సు ఢీకొట్టింది. దీంతో స్థానికులు విద్వంసానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల లాఠీ చార్జిలో ఇద్దరు గాయపడ్డారు.
ఆగ్రహించిన స్థానికులు రాళ్లు రువ్వారు. బస్సు అద్దాలు పగులగొట్టారు. రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన యాదమ్మ కుటుంబానికి నష్టపరిహారాన్ని, కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీ పబ్లిక్ స్కూలు యాజమాన్యం ప్రకటించింది. గాయపడినవారికి 25 వేల నష్టపరిహారం ఇస్తామని కూడా ప్రకటించింది.












Click it and Unblock the Notifications