మద్యనిషేధం అసాధ్యం: చంద్రబాబు
అనంతపురం: రాష్ట్రంలో మద్యపాన నిషేధం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మద్యనిషేధం విధిస్తే మాఫియా పెరుగుతుందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలోని పెనుగొండ, అనంతపురం నియోజకవర్గాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. రాష్ట్రంలో లక్ష బెల్టు షాపులు ఉన్నాయని, వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సాగునీరు, ఖనిజ ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.
తిరుపతి దర్శనం టికెట్లు కూడా బ్లాకులో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. క్రికెట్ మ్యాచు టికెట్లు కూడా అలాగే అమ్ముకున్నారని ఆయన అన్నారు. తన పర్యటనలో చంద్రబాబు ప్రజలకు హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే వేరుశనగ రైతులకు ప్రత్యేక వ్యవసాయ కమీషన్ ఏర్పాటు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. చేనేత కార్మికులకు ఇళ్లు, మగ్గాలు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications