ప్రముఖ రచయిత్రి యశోదారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి. యశోదా రెడ్డి ఆదివారంనాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమె వయస్సు 78 యేళ్లు. ఆమె భర్త పి.టి. రెడ్డి ప్రముఖ చిత్రకారుడు గతంలో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా హైదరాబాదులోని నారాయణగుడాలోని సొంత ఇంటిలో మంచంపై నుంచి లేవడం లేదు. ఆమె మెదడు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఆమె అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు.
యశోదారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమె ధర్మశాల, ఎచ్చమ్మ కథలు తదితర కథాసంపుటులను వెలువరించారు. తెలంగాణ సజీవ భాషను ఆమె తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందారు. ఆమె రాసిన కవితాసంపుటి కూడా వెలువడింది. పలు సాహిత్య విమర్శనా గ్రంథాలు రాశారు. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. ఆకాశవాణిలో తెలంగాణ భాషలో ప్రసంగం చేసిన తొలి రచయితగా ఆమె పేరు పొందారు.












Click it and Unblock the Notifications