45 మందితో వరదల్లో చిక్కుకున్న బస్సులు
హైదరాబాద్: రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం వండ్లూరు వాగుకు అకస్మాత్తుగా వరదలు రావటంతో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. వాగులో ఒక ఆర్టీసి బస్సు, లారీ చిక్కుకున్నాయి. అది పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు. బస్సులోని వారిని రక్షించే ప్రయత్నంలో ఒక వ్యక్తి మరణించాడు. వారిని రక్షించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అలాగే చిట్వేలు - నెల్లూరు రహదారిలో గల అనుంపల్లి వద్ద రెండు బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. వీటిలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు సహాయంకోసం ఎదురుచూస్తున్నారు. నెల్లూరు జిల్లా అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నెల్లూరు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ఇళ్ల పైకప్పులపైకి చేరుకుని బిక్కుబిక్కుమంటున్నారు. స్వర్ణముఖి నిది పొంగిపొర్లుతోంది. వెంకటగిరికి రాకపోకలు బందయ్యాయి. పంబల్ వాగు వద్ద రైల్వే ట్రాక్ కృంగిపోయింది. దీంతో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాయుగుండం అల్పపీడనంగా మారింది. అది నెల్లూరు వద్ద తీరం దాటే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అప్రమత్తం చేశారు. కడప జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.












Click it and Unblock the Notifications