పాచి ప్రసాదం: దుర్గగుడి ఇవోకు అరెస్టు వారంట్లు
విజయవాడ: నాసిరకం ప్రసాదం కేసులో దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇవో) ఆజాద్ కు మున్సిపల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది. ఆజాద్ ను అరెస్టు చేయాలని అసిస్టెంట్ పోలీసు కమీషనర్ (ఎసిపి)కి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆజాద్ బుధవారంనాడు కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 14, 15 తేదీల్లో దుర్గగుడిలో నాసిరకం ప్రసాదం పంపిణీ చేశారంటూ ఒక న్యాయవాది మున్సిపల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దాన్ని పిటిషనుగా పరిగణించి కోర్టు విచారణ చేపట్టి ఈ నెల 16వ తేదీన హాజరు కావాలని చైర్మన్, ఇవోలకు కోర్టు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారిద్దరు గడువు అడగడంతో కోర్టు వారికి బుధవారం వరకు గడువు ఇచ్చింది. చైర్మన్ నారాయణరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కానీ ఇవో ఆజాద్ హాజరు కాలేదు. దీంతో ఆయనకు అరెస్టు వారంట్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications