అభివృద్ధిపై అంకెల గారడీ వద్దు: వైయస్
హైదరాబాద్: అభివృద్ధి విషయంలో అంకెల గారడీ వద్దని, అభివృద్ధిని అంకెల్లో ఎక్కువ చేసి చూపవద్దని, వాస్తవాలనే చెప్పాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన బుధవారంనాడు ముఖాముఖి సమీక్ష జరిపారు.
అభివృద్ధిపై మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరిపి నివేదికలను పంపాలని కూడా ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా పర్యటనల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 83 శాతం పూర్తయ్యాయని, మిగతా హామీలను 2008 డిసెంబర్ నాటికి అమలు చేయాలని ఆయన చెప్పారు.
ఇందిరమ్మ పథకం అమలులో మరింత చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. వచ్చే ఎన్నికలనాటికి వాగ్దానాల అమలును పూర్తి చేయాలని కూడా ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు భూసేకరణ వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని ఆయన అన్నారు. పునరావాసానికి ఇప్పటికే 241 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానును జిల్లా, మండల స్థాయిల్లో వేగంగా అమలు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications