వామపక్ష తీవ్రవాదాన్ని నిలువరించాం: వైయస్
న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాదాన్ని తాము సమర్థంగా నిలువరించగలిగామని, ఈ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. తీవ్రవాదాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగానే కాకుండా సామాజిక, ఆర్థిక సమస్యగా కూడా పరిగణించి చర్యలు తీసుకున్నామని, అందువల్లనే తీవ్రవాదం తగ్గిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచామని, స్వయం ఉపాధి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని, రోడ్లు వేయడం వంటి అభివృద్ది చర్యలు చేపట్టామని, వీటి వల్ల యువకులు తీవ్రవాదం వైపు వెళ్లడం తగ్గిందని ఆయన అన్నారు. తీవ్రవాదం వల్ల ఉపయోగం లేదని భావించి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం కూడా పెరిగిందని ఆయన అన్నారు.
తీవ్రవాదులకు భోజనం పెట్టారనో, షెల్టర్ ఇచ్చారనో సాధారణ పౌరులపై గతంలో కేసులు పెట్టేవారని, అటువంటి 12 వేల కేసులు ఎత్తేశామని, కొత్తగా ఇటువంటి కేసులు పెట్టడం లేదని, దీనివల్ల కూడా తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. దీనికితోడు నిఘా, పోలీసు వ్యవస్థలను పటిష్టం చేశామని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఆక్టోపస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. తాను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగ్ అహ్లూవాలియాను కలుసుకున్నట్లు ఆయన తెలిపారు. విద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు కేటాయింపులు పెంచాలని తాను ఆహ్లూవాలియాను కోరినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications