పెద్ద ఆనందమూ లేదు: పొన్నాల
వరంగల్: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వాగతించారు. అప్పిలేట్ అథారిటీ అనుమతి రద్దు చేసినందుకు పెద్ద నిరాశ లేదని, హైకోర్టు దాన్ని సస్పెండ్ చేసినందుకు పెద్దగా ఆనందమూ లేదని, అయితే ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన సోమవారంనాడు అన్నారు. గత ఆరు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి పూనుకుంటే ప్రతిపక్షాలు అడ్డు పడడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ప్రతిపక్షాలపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జలయజ్ఞాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అనుమతి లేదని, మన రాష్ట్రంలో నిర్మిస్తున్న తెలుగు గంగకు అనుమతులు పూర్తిగా లేవని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల వంటి తెలంగాణలోని ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేవని, వాటిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అవి ఆగిపోయే ప్రమాదం ఉందని, ఇటువంటి చర్యలు సరైనవి కావని ఆయన అన్నారు. నియమనిబంధనలు మారినప్పటికీ పాత ప్రాజెక్టులకు అవి వర్తించవని తాను మొదటి నుంచీ చెబుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications