రాజీనామాకు నేనే మొదట ఉంటా: సర్వే
హైదరాబాద్: తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే రాజీనామా చేసేవారిలో తాను మొదటివాడినని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. తాను పదవుల కోసం పాకులాడలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము బాధతో, ఆవేదనతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు.
రెండో ఎస్సార్సీ వేస్తే తాను రాజీనామా చేస్తానని తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ప్రకటించడం మామూలు విషయం కాదని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులందరూ ఒక్కటే మాటతో ఉన్నారని ఆయన చెప్పారు. రెండో ఎస్సార్సీ వేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని జైపాల్ రెడ్డి కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చాలా మంది ముందుకు వస్తారని ఆయన చెప్పారు. కొంత మంది బయటకు వచ్చే ధైర్యం చేయడం లేదని, కానీ అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తమ ప్రాంతం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, ఈ గడ్డ మీద పుట్టిన తమకు ఆ ఆవేదన ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications