కాకా బాటలో మరింత మంది
హైదరాబాద్: రెండో ఎస్సార్సీకి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ వాణిని మరింత పెంచారు. తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరోటి వద్దని వారు కచ్చితమైన నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించేందుకు సిద్ధపడ్డారు. ఈ నెలాఖరున వారు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. రెండో ఎస్సార్సీకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తానని ప్రకటించిన సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ఇంటిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎం. సత్యనారాయణకావు, మధుయాష్కీ, అమోస్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నేతన ప్రతినిధిగా ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్లు మధుయాష్కీ గౌడ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
తాము వెంకటస్వామి బాటలో నడుస్తామని, అవసరమైతే తాము కూడా రాజీనామా చేస్తామని అమోస్ చెప్పారు. రెండో ఎస్సార్సీ వేస్తే పార్టీ మునగడం ఖాయమని తెలంగాణ నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామగ్రామాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని ఉన్న ప్రజల మనోభావాలను సోనియాకు తెలియజేస్తామని జి. వెంకటస్వామి చెప్పారు. వెంకటస్వామి రాజీనామా నిర్ణయం ఢిల్లీ వరకు ప్రభావం చూపుతుందని ఎం. సత్యనారాయణరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని మధయాష్కీ గౌడ్ చెప్పారు. తాము టిర్సీసిసి నేత జి. చిన్నారెడ్డి ప్రకటనతో ఏకీభవించడం లేదని, చిన్నారెడ్డి ప్రకటన పార్టీకి చేటు తెస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రమంత్రి డి. శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు, విఠల్ రావు తమకు సంఘీభావం తెలిపారని ఎం. సత్యనారాయణరావు, అమోస్, మధుయాష్కీ చెప్పారు.












Click it and Unblock the Notifications