టిడిపి చీలదు: అలాగే భిన్న స్వరాలు
హైదరాబాద్: అధినేత నారా చంద్రబాబునాయుడు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీలో తెలంగాణం చిచ్చు రేపుతూనే ఉంది. తెలంగాణపై తమ పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ చేసిన ప్రకటన వ్యక్తిగతమైందని, తెలంగాణపై చంద్రబాబుదే తుది నిర్ణయమని హైదరాబాదుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. పార్టీ రెండుగా చీలిపోదని, తాము చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి ఇదివరలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు.
దేవేందర్ గౌడ్ లాంటి సీనియర్ నేతను పార్టీ వదులుకోదని రాయలసీమకు చెందిన తెలుగుదేశం నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు. దేవేందర్ గౌడ్ చేసిన ప్రకటన ప్రభావం మిగతా ప్రాంతాలపై ఉంటుందని కోస్తాకు చెందిన నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏ ప్రాంతం నాయకులు ఆ ప్రాంత ప్రజల సెంటిమెంటును వెల్లడిస్తారని రాయలసీమకు చెందిన నేత డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి అన్నారు. ఇప్పుడైతే సమైక్యాంధ్రనే తమ పార్టీ విధానమని కోస్తా ప్రాంతానికి చెందిన నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామని పార్టీ ఇదివరకే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications