వస్తుందంటే మేమూ సిద్ధం: అమోస్
హైదరాబాద్: రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే తాము కూడా రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తెలంగాణ కాంగ్రెస్ ఫోరం నేత అమోస్ అన్నారు. రాజీనామాలతో తెలంగాణ రాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు వేరే పద్ధతులున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అందుకు వేచి చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు కూడా తెలుసునని ఆయన అన్నారు.
రాజీనామాల ప్రకటనతో తెరాస తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. తెరాస నాటకాలు ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రశేఖరరావు రాజీనామాల ప్రకటనను తెరాస అసమ్మతి శాసనసభ్యులు కూడా తప్పు పట్టారు. చంద్రశేఖరరావు డ్రామా ఆడుతున్నారని తెరాస అసమ్మతి శాసనసభ్యుడు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. చంద్రశేఖరరావు తనతో మాట్లాడక రెండేళ్లవుతోందని, రాజీనామా విషయం తనకు చంద్రశేఖరరావు చెప్తే ఆలోచిస్తానని కంభంపాటి లక్ష్మారెడ్డి అన్నారు. తమ అసమ్మతి శాసనసభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మరో అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. రాజీనామాలు చేయాలనే చంద్రశేఖరరావు నిర్ణయాన్ని దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణి కూడా వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications
