మార్చి 6న తెరాస రాజీనామాలు
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వ వైఖరికి నిరసనగా మార్చి 6వ తేదీన రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు), పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ మోసాల చిట్టాను మార్చి 10వ తేదీన విప్పుతామని వారంటున్నారు. 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు, నలుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామాస్త్రాలు సంధిస్తారు.
తమ నాయకుడు కె. చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెరాస ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెరాస శాసనసభ్యులు నాయని నర్సింహారెడ్డి, ఎ. చంద్రశేఖర్ అంతకుముందు చెప్పారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ నాయకులు హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తుండడంతో తెరాస ఆ ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి తీవ్రమైన చర్యకు దిగే ఉద్దేశంతో రాజీనామాలకు సిద్ధపడింది.












Click it and Unblock the Notifications
