సింగూరు భూసేకరణ న్యాయమే: హైకోర్టు
కోల్‌కతా: సింగూరులో టాటా గ్రూపు ప్రతిష్టాత్మంగా చేపట్టిన చిన్న కార్ల ప్లాంటు కోసం జరిగిన భూసేకరణ న్యాయబద్ధమేనని కలకత్తా హైకోర్టు శుక్రవారం తెలిపింది. టాటా గ్రూపు భూసేకరణను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నానో కార్ల ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలిగినట్లయింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామీకరణ కార్యక్రమానికి కూడా ఈ తీర్పు ఊపునిచ్చేదే. సింగూరులో నానో కార్ల ప్లాంటు కోసం ప్రభుత్వం జరిపిన 997.11 ఎకరాల భూసేకరణను సవాలు చేస్తూ హైకోర్టులో 11 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎస్ నజ్జర్‌తో కూడిన కలకత్తా హైకోర్టు డివిజిన్ బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్‌ల విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇక్కడ అధికారాన్ని ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకోలేదని అభిప్రాయపడింది. భూసేకరణ అక్రమంగా జరగలేదని స్పష్టం చేసింది.
కలకత్తా మెట్రో పరిధికి 40 కిలోమీటర్ల దూరంలో హిగ్లీ జిల్లాలోని సింగూరు వద్ద టాటా కార్ల ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరిపడాన్ని సవాలు చేస్తూ గత ఏడాది ఫిబ్రవరిలో జోయ్‌దీవ్ ముఖర్జీ అనే వ్యక్తి కలకత్తా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన పిటిషన్‌కు తోడు వేర్వేరు వ్యక్తులు, సంస్థల నుంచి మరో 10 పిటిషన్లు సింగూరు భూసేకరణను సవాలు చేస్తూ దాఖలయ్యాయి. ప్రభుత్వం సింగూరులో టాటా కార్ల ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములను ప్రభుత్వ సేకరించిందని, అది అక్రమమని పిటిషన్‌దారులు కోర్టుకు విన్నవించారు. అయితే తాము మాత్రం టాటా మోటార్స్ ప్లాంటు కోసం భూసేకరణను నిబంధనల ప్రకారమే జరిపామని ప్రభుత్వం కోర్టులో వాదించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో 11 పిటిషన్లపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు శుక్రవారం వాటన్నింటినీ తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications
