నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి: కోనేరు
విజయవాడ: విద్యార్థిని అయేషా హత్య కేసుతో తనకు గానీ తన బంధువులకు గానీ సంబంధం ఉన్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మున్సిపల్ శాఖా మంత్రి కోనేరు రంగారావు సవాల్ చేశారు. అయేషా హత్య కేసు గురించి తాను పోలీసులతో మాట్లాడినట్లు రుజువు చేస్తే చాలునని, తాను రాజకీయాలకు స్వస్తి చెప్తానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిందితులను బయట పెట్టకుండా వస్తున్న వత్తిళ్లేమిటో బయట పెట్టాలని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు.
అయేషా హత్య కేసులో నిందితులను బయట పెట్టాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉమామహేశ్వర రావు విజయవాడ పోలీసు కమీషనర్ సి.వి. ఆనంద్ ను కోరారు. ఈ మేరకు ఆయన ఆనంద్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాము రాజకీయంగా బురద చల్లుతున్నామనే మాటలో నిజం లేదని, కేసులోని నిందితులు బయటకు రావాలనేదే తమ ఉద్దేశమని ఉమామహేశ్వర రావు మీడియా ప్రతినిధులతో అన్నారు. నిందితులకు రాజకీయ పెద్దలతో గల సంబంధాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications