కాంగ్రెస్, తెరాసల మధ్య ఘర్షణ
సంగారెడ్డి: కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల మధ్య గురువారం మెదక్ జిల్లాలోని పలు చోట్ల ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి ఫరీదుద్దీన్ పై దాడికి నిరసనగా కాంగ్రెస్ గురువారంనాడు బంద్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెరాస జిల్లా అధ్యక్షుడు రఘునందన్ ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
సంగారెడ్డిలో ఎమ్మెల్సీ సత్యనారాయణ ఇంటి ముందు తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తెరాస వైఖరికి నిరసనగా ముగ్గురు మంత్రులు ర్యాలీ నిర్వహించారు. మంత్రులు దామోదరం రాజనర్సింహ, ఫరీదుద్దీన్, ముఖేష్ గౌడ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దామోదరం రాజనర్సింహ ఇంటి వద్ద ఈ ర్యాలీ ప్రారంభమై అంబేడ్కర్ చౌరస్తా వరకు సాగింది. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలో తెరాస అసమ్మతి శాసనసభ్యుడు జయప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ్యుడు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications