మా పెద్దలు కెసిఆర్ తో కుమ్మక్కు: ముఖేష్
మెదక్: తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కుమ్మక్కయినట్లున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ మంత్రి ముఖేష్ అన్నారు. మంత్రులు దామోదరం రాజనర్సింహ, ఫరీదుద్దీన్ లతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. కాంగ్రెసును భూస్థాపితం చేస్తామని కెసిఆర్ అంటే ఈ పెద్దమనుషులు ఒక్కరూ మాట్లాడలేదని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న కాంగ్రెస్ నాయకులు జి. వెంకటస్వామి, ఎం. సత్యనారాయణరావు, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ, వి. పురుషోత్తమరెడ్డిలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము, తమ సిద్ధాంతాలు నచ్చకుంటే బయటకు వెళ్లిపోవచ్చునని ఆయన హెచ్చరించారు. జనంలోకి వచ్చి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిస్తే సహించమని ఆయన అన్నారు.
కెసిఆర్ సహా తెరాస నాయకులెవరినీ తెలంగాణలో తిరగనివ్వబోమని మంత్రులు హెచ్చరించారు. తెరాసతో అమీతుమీ తేల్చుకుంటామని వారన్నారు. తమకు కావాల్సింది దొర తెలంగాణ కాదని, దళిత తెలంగాణ కావాలని వారన్నారు. దళిత తెలంగాణను ఇచ్చే సత్తా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే ఉందని వారన్నారు. మంత్రి ఫరీదుద్దీన్ పై తెరాస కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ వారు గురువారం సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications