దొంగ బాబా నిత్యానంద స్వామి అరెస్టు
హైదరాబాద్: దొంగ బాబా త్రిపురానందనాథ స్వామి అలియాస్ నిత్యానంద స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగనోట్ల చెలామణి, నీలి చిత్రాల తయారీ కేసుల్లో పోలీసులు నిత్యానంద స్వామిని అరెస్టు చేశారు. నిత్యానంద స్వామిని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల ఆయన ఆశ్రమంలోనే అరెస్టు చేసినట్లు సమాచారం. స్టేట్ మ్యూజియంలో నిజాం కాలంనాటి కత్తులను దొంగిలించిన చిల్లర నేరస్థులు పోలీసులకు చిక్కడంతో నిత్యానందస్వామి గుట్టు బయటపడింది.
ఏడాది క్రితం తాము నిత్యానంద స్వామి అశ్రమంలో దొంగతనం చేశామని, డబ్బులు, సిడీలు దొంగిలించామని వారు చెప్పారు. తాము దొంగిలించిన నోట్లు నకిలీవని, వాటిలో సగం నోట్లను కాల్చివేసి, మిగతా సగం నోట్లతో జల్సాలు చేశామని ఆ దొంగలు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హైదరాబాదులోని నిత్యానంద స్వామి ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నీలి చిత్రాలు సిడీలు, దేవాలయాల్లో దొంగతనాల కోసం వేసిన స్కెచ్ లు పోలీసులకు లభించాయి.
నిత్యానంద స్వామికి ఐపియస్, ఐఎఎస్ అధికారులతోనూ, రాజకీయ నాయకులతోను సంబంధాలున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ బోరబండ గాయత్రీనగర్, హైదరాబాదు సమీపంలోని షంషాబాద్ లోని సాతంరాయి, పశ్చిమగోదావరి జిల్లాలోని లక్కవరం, విజయవాడల్లో ఆయన ఆశ్రమాలు నిర్వహిస్తున్నాడు. స్టేట్ మ్యూజియంలో కత్తుల చోరీకి పాల్పడిన ఇద్దరు బాలనేరస్థులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరు చెప్పిన సమాచారంతో పోలీసులు బోరబండలోని ఆశ్రమంపై దాడి చేశారు.












Click it and Unblock the Notifications