అభివృద్ధి తెలంగాణతో వైయస్ వర్గీయులు
న్యూఢిల్లీ: అభివృద్ధి మంత్రంతో తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వర్గీయులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. తాము ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకులం కాదని, తమ ఢిల్లీ యాత్ర సీనియర్లకు వ్యతిరేకం కాదంటూనే వారు అభివృద్ధి జరిగిన తెలంగాణ కావాలని అంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి వినిపించేందుకు వారు ఢిల్లీలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. 9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు శాసనసభ్యులు గల 20 మంది ఈ బృందంలో ఉన్నారు. వారు ప్రణబ్ ముఖర్జీతోనూ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగ్ అహ్లువాలియాను కలువనున్నారు.
ముందు తెలంగాణ అభివృద్ధిని జరగనివ్వాలని, తర్వాతే ప్రత్యేక తెలంగాణ అని శాసనసభ్యుడు సురేష్ షేట్కర్ అంటున్నారు. తమకు అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలని ఎమ్మెల్సీ పుల్లెల పద్మావతి అన్నారు. తాము తెలంగాణను అడ్డుకోవడం లేదని, అభివృద్ధి కావాలంటున్నామని శాసనసభ్యుడు రాజేశ్వర్ చెప్పారు. తాము తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని ఎమ్మెల్సీ భట్టి విక్రమార్క అన్నారు. మొత్తం మీద తెలంగాణ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఢిల్లీకి చేరాయి.












Click it and Unblock the Notifications