మహా ధర్నాకు భయపడ్డారు: బాబు
హైదరాబాద్: తమ మహాధర్నాకు భయపడి చెరుకు మద్దతు ధరను టన్నుకు 1100 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. చెరుకు రైతుల సమస్యలపై మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరుటి బకాయిలు చెల్లించని ప్రభుత్వం చెరుకు రైతులను మరింత కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో వాణిజ్య బ్యాంకుల రుణాలు తప్పకుండా మాఫీ చేయిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.
రైతుల రుణాలను మాఫీ చేయాలని, ఇన్ పుట్స్ సబ్సిడీలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రైతులపై ప్రభుత్వం కపట ప్రేమ ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు ఆరు నెలలు గడిచినా అతీగతీ లేదని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన సంగారెడ్డిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎడ్లబండిపై ఊరేగింపుగా ధర్నాస్థలికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications