వైయస్ అన్నట్లు కుట్ర కాదు: హర్షకుమార్
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ పై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఏ విధమైన కుట్ర జరగలేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఇరికించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కుట్ర చేశారనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనతో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద విభేదించారు. అరుణ్ కుమార్ వ్యాఖ్యకు తక్షణ నిరసన వ్యక్తమైందని ఆయన చెప్పారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యల విషయంలో ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసులో ఎవరు తప్పు చేసినా ముఖ్యమంత్రి వారికి మద్దతుగా నిలబడతారని, అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో ఆ విధమైన పద్ధతి మంచిది కాదని ఆయన అన్నారు. అరుణ్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించిన నోటును తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చానని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన సిడిలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి అందజేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications