ప్రభుత్వ భూములు కొనొద్దు: బాబు
హైదరాబాద్: ప్రభుత్వం అమ్మే భూములను కొంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. భూముల వేలాన్ని నిరసిస్తూ ఆదివారం అఖిల పక్షం మహాధర్నా హైదరాబాదులోని బాపూఘాట్ వద్ద జరిగింది. ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం భూములన్నింటినీ ఇష్టారాజ్యంగా అమ్ముతూ పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి కూడా భూమి లేకుండా చేస్తోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ భూములు పెద్ద యెత్తున అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్నే కాదు, ఆ భూములను కొంటున్నవారిని కూడా తాము హెచ్చరిస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ఆయన అన్నారు. ప్రభుత్వం భూములను వేలం వెర్రిగా అమ్ముతోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారిందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వానికి 99 లేఖలు రాశానని, ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications