తెలంగాణ దెబ్బ చూపిస్తాం: కెసిఆర్
న్యూఢిల్లీ: వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చట్టబద్ద సంస్థను వేస్తామనడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారంనాడు జరిగిన సామూహిక ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆరు సూత్రాల పథకం వంటి రాజ్యాంగ నియమాలను అమలు చేయలేదని, కోర్టు తీర్పులు అమలు కాలేదని, ఇప్పుడు చట్టబద్ద సంస్థ అంటూ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ మీద ఉక్కుపాదం మోపి తమ గొంతు నొక్కుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నినాదంతో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణకు మొండిచెయ్యి చూపిస్తోందని ఆయన అన్నారు. తరిమి తరిమి కొడదామని, తెలంగాణ పౌరుషమేమిటో చూపుదామని, ప్రాణాలు అడ్డు పెట్టి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం మాయమవుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారని, చంద్రబాబే మాయమయ్యాడని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కళ్లు మూసుకుపోయి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం ముందు కొట్టుకుపోతారని, తాను శాపం పెడుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ దెబ్బను రుచిచూపిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను మూలన పెట్టేసి పోతిరెడ్డిపాడును ఆఘమేఘాల మీద పూర్తి చేస్తున్నారని, నీటి దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. దోపిడీకి వ్యతిరేకంగా స్వయం పాలన కోసం తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తున్నామని, తెలంగాణ సాధించేవరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని భూములను చంద్రబాబు ఎంఆర్ ప్రాపర్టీస్ కు కట్టబెడితే రాజశేఖర రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు 115 ఎకరాలు అప్పగించారని ఆయన అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెరాస సిద్ధాంతకర్త జయశంకర్ కూడా ప్రసంగించారు.












Click it and Unblock the Notifications