లోకసభ: తెలంగాణపై బిజెపి వాకౌట్
న్యూఢిల్లీ: తెలంగాణపై చర్చకు స్పీకర్ సోమనాధ్ చటర్జీ అనుమతి ఇవ్వనందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు సోమవారం లోకసభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుల రాజీనామాల సందర్భంగా తెలంగాణపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ స్పీకర్ ను కోరారు. స్పీకర్ అందుకు అనుమతించలేదు. దాంతో తెలంగాణను యుపిఎ ప్రభుత్వం మోసం చేసిందంటూ బిజెపి సభ్యులు వాకౌట్ చేశారు.
తాను రాజీనామా చేయడానికి గల కారణాలను తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సభలో వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో హామీ ఇచ్చిందని, అలాగే ఏకాభిప్రాయ సాధన ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకుంటామని రాష్ట్రపతి ప్రసంగంలో హామీ ఇచ్చారని, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత కూడా ఈ హామీని అమలు చేయనందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని ఆయన వివరించారు. మిగతా సభ్యులు కూడా తమ రాజీనామాలకు కారణాలు వివరించారు.
తెలంగాణ అంశంపై బిజెపి అవకాశవాద వైఖరిని అవలంబిస్తోందని కాంగ్రెస్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లోకసభలో విమర్శించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామీ ఇవ్వలేదని, రెండో ఎస్సార్సీ వేస్తామని హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications