కాంగ్రెసుకు డెత్ వారంట్: కెసిఆర్
న్యూఢిల్లీ: తమ రాజీనామాలు కాంగ్రెసుకు తెలంగాణ ప్రజలు జారీ చేస్తున్న డెత్ వారంట్ అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తనతో పాటు నలుగురు పార్లమెంటు సభ్యులు లోకసభ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీకి రాజీనామా లేఖలు సమర్పించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధించేవరకు నిద్రపోమని ఆయన చెప్పారు.
తమకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ దమన నీతిని ఎండగట్టడానికే రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీసిందని ఆయన విమర్శించారు. ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాదులో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 12వ తేదీన మహబూబ్ నగర్ లో సభ జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రేపు (మంగళవారం) రాజీనామాలు చేశారు.












Click it and Unblock the Notifications