పర్యవసానాలు తెరాసవే: రాఘవులు
హైదరాబాద్: త్యాగాలు చేసినవారు పర్యవసానాలు అనుభవిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాలపై సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. తెరాస ఉద్దేశాల గురించి, పర్యవసానాలు గురించి తాము మాట్లాడబోమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాస నాయకులు పదవులను త్యాగాలు చేశారని, ఆ త్యాగాల పర్యవసానాలను అంచనా వేసుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు.
తెరాస రాజీనామాలు చేయడం అవివేకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రాజీనామాలు ఒక్కటే పరిష్కారం కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చట్టసభల్లో ఉన్నా లేకున్నా ప్రజాసమస్యలను లేవనెత్తడానికి వేదికలుంటాయని, అయితే అంత మాత్రాన రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజీనామాలపై తెరాస పునరాలోచన చేసుకోవాలని ఆయన సూచించారు.
వాగ్దాన భంగం జరిగిందన్న అభిప్రాయంతో తెరాస సభ్యులు రాజీనామా చేశారని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణ ఎప్పుడూ మోసానికి గురవుతూనే ఉందని, తెరాస రాజీనామాల విషయంలో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications