సోనియా చెప్పేదాకా ఆగాలి: డిఎస్
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)శాసనసభ్యులు రాజీనామా చేయడం సరి కాదని ఉన్నత విద్యామంత్రి డి. శ్రీనివాస్ అన్నారు. తీవ్ర వాదోపవాదాల అనంతరం స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తెరాస సభ్యుల ఆరోణలకు వివరణ ఇచ్చేందుకు శ్రీనివాస్ ను అనుమతించారు. తన రూలింగ్ కు కట్టుబడి ఉండాలని స్పీకర్ చెప్పడంతో ప్రతిపక్షాల సభ్యులు తమ పట్టు వీడి ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు సహకరించారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై సానుకూలంగా పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. సరైన సమయంలో సోనియా నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
తెరాస సభ్యులు రాజీనామాలను ఉపసంహరించుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని, తమపై పోరాడాలని ఆయన సూచించారు. తమ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణపై నిర్ణయం తీసుకునే లోగా అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు జరిగితే వేలెత్తి చూపి సరిదిద్దుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. తెరాసకు తెలంగాణ సాధన ఏకైక ఎజెండా అని, ఏదో రోజున వారు రాజీనామాలు చేస్తారని, ఏదైనా చేస్తారని, తమ పరిస్థితి అలా కాదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని తెరాస చేసిన విమర్శను ఆయన ఖండించారు. తాము దద్దలం కాదని ఆయన అన్నారు. వాస్తవాలను చెప్పడానికి తాను సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఒత్తిళ్ల వల్ల, ఎజెండా వల్ల తెరాస సభ్యులు రాజీనామాలు చేశారని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితి రాకూడదనే తాము భావించామని ఆయన చెప్పారు.
తెలంగాణపై తాము తెరాసను మోసం చేయలేదని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ శాసనమండలిలో చెప్పారు. తెరాస సభ్యులు రాజీనామాలపై పునరాలోచన చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం తమ పార్టీ అధిష్ఠానవర్గం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications