రాజీనామాలు: తెరాస ఆందోళనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, ఎమ్మెల్సీల రాజీనామాల సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు శాసనసభ వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. శాసనసభలోకి చొచ్చుకెళ్లేందుకు వారు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాదులోని పలు చోట్ల తెరాస కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోనియాకు, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళవారం ఉదయం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెరాస శాసనసభ్యులు ర్యాలీగా శాసనసభకు వచ్చారు. సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించారు. అయితే తెరాస సభ్యులు తమ పట్టు వీడకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేసి వారితో చర్చలు జరిపారు.
తిరిగి సభ సమావేశమైన తర్వాత అంగీకారం మేరకు నలుగురు తెరాస సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. తెరాస సభ్యులు విజయరామారావు, హరీష్ రావు, నాయని నర్సింహారెడ్డి, టి. రాజేందర్ మాట్లాడారు. అనంతరం వారు రాజీనామాలు సమర్పించి సభ వెలుపలికి వెళ్లిపోయారు. వారికి సభ వెలుపల ఘన స్వాగతం లభించింది.












Click it and Unblock the Notifications