తెరాసది రాజకీయ డ్రామా: మొయిలీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాలు రాజకీయ నాటకమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. తెరాస రాజీనామాలను ప్రజలు అభినందిస్తారని అనుకోవడం వట్టి మాట అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్లమెంటులో మాట్లాడే చివరి అవకాశం కూడా తెరాస నాయకులు కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరలేదని, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాలేదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి)ది మాటల గారడీ అని, బిజెపి మాటలను ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావును ఆరా తీశారు. హనుమంతరావు మంగళవారంనాడు ప్రధానిని కలుసుకున్నారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితిని తాను ప్రధానికి వివరించినట్లు హనుమంతరావు చెప్పారు. తెరాస రాజీనామాల వల్ల ఏదో మేరకు తెలంగాణలో కాంగ్రెసుకు నష్టం జరుగుతుందని ఆయన ప్రధానికి చెప్పారు.












Click it and Unblock the Notifications