తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు మంగళవారం రాజీనామాలు చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ శాసనసభ్యులు శాసనసభలో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి, ఎమ్మెల్సీలు శాసనసమండలిలో చెర్ పర్సన్ చక్రపాణికి తమ రాజీనామా పత్రాలు సమర్పించి సభల వెలుపలికి వెళ్లిపోయారు. రాజీనామాలు చేసిన సభ్యులకు శాసనసభ వెలుపల పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం చెప్పారు. తెరాస సభ్యులు శాసనసభలో తమ వాదనను వినిపించి రాజీనామాలు సమర్పించి వెలుపలికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తెరాస సభ్యులు తమ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కడపకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు విమర్శించారు. తెలంగాణను ముఖ్యమంత్రి గుత్తకు తీసుకున్నారా, మంత్రులు గుత్తకు తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ముఖ్యమంత్రి కాశ్మీర్ తో, పాకిస్తాన్ తో పోల్చడాన్ని, తెలంగాణ ఇస్తే తీవ్రవాదం పెరుగుతుందని అనడాన్ని ఆయన ఖండించారు. మంత్రులు సిగ్గులేకుండా ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్నారని తెరాస సభ్యుడు హరీష్ రావు విమర్శించారు. కడపలో జరిగిన అభివృద్ధి మంత్రుల జిల్లాల్లో జరిగిందా చూసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్లాలని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహా రెడ్డి అన్నారు. రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించి తెలంగాణ నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications