కాంగ్రెస్, టిడిపిల మాటల యుద్ధం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుల రాజీనామా అనంతరం మంగళవారం శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చెలరేగాయి. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ద్రోహం చేసిందని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ సోనియా, రాజశేఖర రెడ్డిల డ్రామా కంపెనీ, కాంగ్రెస్ మసి కాక తప్పదని అని ఆయన వ్యాఖ్యానించారు. మహా సంగ్రామం జరగబోతోందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెసుకు గుణపాఠం చెప్పబోతున్నారని, అది జరగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన చెప్పారు.
సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఎలా కాలు పెడ్తారో చూస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ద్రోహుల సంగతి ప్రజలు చూస్తారని ఆయన అన్నారు. తెరాస నాయకులకు ప్రణాళిక లేదు, ఆలోచన లేదు, పద్ధతి లేదు కాబట్టి కాంగ్రెసును నమ్మిందని, కాంగ్రెస్ వారిని మోసం చేసిందని, కానీ ప్రజలను మోసం చేయలేరని, తెలంగాణ ప్రజలు తమ పౌరుషం ఏమిటో చూపుతారని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యలపై మంత్రి షబ్బీర్ అలీ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ నాయకులు సోనియాను, రాజశేఖర రెడ్డిని విమర్శించే సత్తా దేవేందర్ గౌడ్ కు లేదని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గంలోనే సభ పెడ్తామని, దమ్ముంటే ఆపాలని ఆయన సవాల్ చేశారు.
తెరాస శాసనసభ్యుల రాజీనామాల అనంతరం కాంగ్రెస్ పై తెలుగుదేశం సభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. తెరాసను కాంగ్రెసు మోసం చేసిందని ఆయన అన్నారు. మోసం చేయడం కాంగ్రెసుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు. తెరాస గులాబీ కండువాలు వేసుకుని ఎందుకు ఎన్నికల్లో పోటీ చేశారని ఆయన అడిగారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని విమర్శించారు.
తెలంగాణపై తాము సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామీణాభివృద్ధి మంత్రి జి. చిన్నారెడ్డి చెప్పారు. సోనియా నిర్ణయం తీసుకునే వరకు తెరాస శాసనసభ్యులు ఆగాలని, తెలంగాణ ఇవ్వబోమని సోనియా చెప్పినప్పుడు రాజీనామాలు చేయవచ్చునని ఆయన అన్నారు. మూడు నాలుగు నెల్లోల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎన్నికల సమయంలో కాంగ్రెసుతో చేసుకున్న ఒప్పందంలో ఎందుకు రాసుకోలేదని ఆయన తెరాసను అడిగారు. రెండో ఎస్సార్సీ అవసరమన్న ఒప్పందంపై తెరాస సంతకం చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications