తెలంగాణకే పని చేస్తా: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తమ పార్టీ అధిష్ఠానవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించినా, అంగీకరించకపోయినా తెలంగాణ కోసం తమ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటామని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. తాను తెలంగాణ ఎజెండాపై మొదటి సారి పార్లమెంటు ఎన్నికయ్యానని, మూడు సార్లు జైలుకు వెళ్లానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీని విడిపోయేది కూడా లేదని, పదవులకు రాజీనామా చేయబోనని ఆయన స్సష్టం చేశారు.
తాను ఇందిరా గాంధీ హయాంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశానని, తాను పార్టీతోనే ఉంటానని ఆయన చెప్పారు.భువనగిరి సభకు తాను వ్యతిరేకం కానని, అయితే సభలో మాట్లాడే అంశాలపైనే తాను అభ్యంతరాలు లేవనెత్తానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)యే గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంటు ముందు అభివృద్ధి పనిచేయదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ కోసమే పని చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications