శివంపై తెలంగాణ విద్యార్థుల దాడి
హైదరాబాద్: హైదరాబాదులోని సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న శివం ఆలయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విద్యార్థి సంఘం కార్యకర్తలు శుక్రవారంనాడు దాడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సత్యసాయిబాబా చేసిన ప్రకటనను నిరసిస్తూ వారు ఈ దాడి చేశారు. ఈ సందర్భంగా శివం రోడ్డులో కాస్తా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
సత్యసాయిబాబా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచారని తెరాస నాయకుడు హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు సత్యసాయిబాబా బేషరతు క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ నేతల ప్రోద్బలంతోనే సత్యసాయిబాబా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. సత్యసాయిబాబాను కూడా తెరాస నాయకులు విమర్శించడం దురదృష్టకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురంలో అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని సత్యసాయిబాబా గురువారం పుట్టపర్తిలో అన్నారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటూ విడిపోతే పెద్ద దెబ్బే తగులుతుందని ఆయన అన్నారు. కొంతమంది వ్యక్తుల స్వార్థమే ప్రత్యేక వాదం తలెత్తడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications