విమానాశ్రయం పేరుపై మాటకు మాట
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీ రామారావు పేరును పెట్టకపోతే ఈ నెల 14వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ఈ విమానాశ్రయాన్ని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని ప్రారంభించనున్నారు. బేగంపేట విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీ రామారావు పేరు ఉందని, దాన్ని తొలంగించాల్సిన అవసరం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మహా నటుడిగా, రాజకీయవేత్తగా ఎంతో సేవ చేసిన ఎన్టీరామారావు పేరును తొలగించడం అందర్నీ అవమానించడమేనని ఆయన అన్నారు.
దేశంలోని ఏ విమానాశ్రయానికి కూడా రెండు పేర్లు లేవని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీ రామారావు పేరు పెట్టడమే తప్పని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. యువతకు మార్గదర్శి అయిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెడితే తప్పేమిటని ఆయన అడిగారు. అయినా విమానాశ్రయానికి పేరు పెట్టడమనేది రాష్ట్ర పరిధికి సంబంధించిన అంశం కాదని, ఇది కేంద్ర పరిధిలోనిదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications