కరీంనగర్ ఫలితం పునరావృతం: ఎమ్మెస్సార్
హైదరాబాద్/ నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా చేసిన లోకసభ, శాసనసభా స్థానాల్లో కరీంనగర్ లోకసభ ఎన్నిక ఫలితం పునరావృతమవుతుందని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభలో ఆయన రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆర్టీసిని ఆదుకోవాలని సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో కన్నా జోక్యం చేసుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. తాను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడడానికి కన్నా స్థాయి ఏమిటని ఆయన ప్రశ్నించారు. దాంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్టీసిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని మరో సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన గురువారంనాడు మాట్లాడారు. తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవి ఎవరో ఇచ్చింది కాదని, ప్రజలే ఇచ్చారని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయేది లేదని ఆయన అన్నారు. పార్టీ తనపై ఏ విధమైన చర్యకు దిగినా భయపడేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications