అభివృద్ధికి విమానాశ్రయం దోహదం: సోనియా

సోనియా నాయకత్వంలో దేశ ముఖ చిత్రం మారిపోతుందని పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇంత తొందరగా పూర్తి చేసినందుకు ఆయన అభినందించారు. పౌర విమాన యానం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించే పాత్రను ముందుగా ఆంధ్రప్రదేశ్ గుర్తించిందని ఆయన అన్నారు. పౌర విమానాయానాన్ని సాధారణ ప్రజలకు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల భౌతిక సంబంధాల అంతరాలను పౌర విమానయానం మాత్రమే తీర్చగలదని ఆయన అన్నారు. మూడేళ్ల కాలంలో విమానాశ్రయ నిర్మాణం కల నిజమైందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఓడరేవులు వస్తున్నాయని, ప్రపంచ ప్రమాణాలతో గంగవరం, కృష్ణపట్నం ఓడరేవులు పూర్తవుతున్నాయని ఆయన చెప్పారు. కార్గో సేవల ద్వారా విమానాశ్రయం ఆర్థికాభివృద్దికి దోహదం చేస్తుందని జిఎంఆర్ గ్రూప్ అధినేత మల్లికార్జునరావు అన్నారు. ఈ విమానాశ్రయం హైదరాబాదు రూపురేఖల్ని మార్చేస్తుందని ఆయన అన్నారు. గడువు కన్నా రెండు రోజుల ముందే విమానాశ్రయం నిర్మాణం పనులను పూర్తి చేశామని ఆయన చెప్పారు.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. వరంగల్ జిల్లాలోని దేవాదుల నుంచి ఆమె నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వాగతం చెప్పారు. ఆమె వెంట ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, దాసరి నారాయణరావు, టి. సుబ్బిరామిరెడ్డి, శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సోనియా గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దీంతో సోనియా మూడు జిల్లాల సుడిగాలి పర్యటన ముగిసింది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 550 ఎకరాల్లో నిర్మించారు. దేశంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయం ఇది. ఆసియాలోనే అతి పెద్ద రన్ వే ఉంది. కొటీ 20 లక్షల మంది రోజుకు ఇక్కడి నుంచి ప్రయాణించవచ్చు. శనివారం నుంచి ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ విమానాశ్రయం నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ప్రపంచంలోని 35 దేశాలకు ఇక్కడి నుంచి రాకపోకలు జరుగుతాయి. ఇప్పటికే 22 విమానయాన సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ప్రతి రోజు ఈ విమానాశ్రయం నుంచి 500 విమానాలు వచ్చిపోవచ్చు. దుబాయ్, సింగపూర్ విమానాశ్రయాల లాగా ఇది విమానాల రాకపోకలకు కూడలిగా మారనుంది. దీన్ని భవిష్యత్తులో 4 కోట్ల ప్రజల అవసరాల తీర్చే విధంగా విస్తరించనున్నారు. ఇంధనాన్ని భూగర్భంలో నిలువ చేసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications