భువనగిరి సభ ఆపం: కాకా
హైదరాబాద్: నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ నెల 24వ తేదీన తలపెట్టిన తెలంగాణ రణభేరీ సభను ఆపేది లేదని సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి స్పష్టం చేశారు. వెంకటస్వామి ఇంట్లో మంగళవారం సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాజా పరిణామాలపై చర్చించారు. కొందరు భువనగిరి సభను ఆపించాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని వెంకటస్వామి మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడినైన తాను సభకు హాజరవుతుంటే అది పార్టీ వ్యతిరేకం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. పార్టీ శ్రేయస్సు కోసమే భువనగిరి సభను తలపెట్టామని, ఆరునూరైనా దాన్ని ఆపేది లేదని ఆయన అన్నారు.
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, బియస్పీ నేత మాయావతి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారని వెంకటస్వామి చెప్పారు. ఇప్పుడంతా చిన్న రాష్ట్రాల ఊపు నడుస్తోందని ఆయన అన్నారు. సభకు పార్టీ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. వీరప్ప మొయిలీ మాట వినలేదని, సభ జరిగి తీరుతుందని ఆయన అన్నారు. అధిష్ఠానవర్గం మాటగా చెబుతున్నాని, సభను ఆపాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీ తెలంగాణ కాంగ్రెస్ వేదిక కన్వీనర్ అమోస్ తో అన్నారు. ఈ మేరకు ఆయన అమోస్ కు ఫోన్ చేసి చెప్పారు. అయితే తాము సభను రద్దు చేసేది లేదని అమోస్ వీరప్ప మొయిలీకి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications