సభ రద్దు చేసుకోవాల్సిందే: సర్వే
హైదరాబాద్: భువనగిరి సభను సీనియర్లు రద్దు చేసుకోవాల్సిందేనని సిద్ధిపేట కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. సభ నిర్వహించి పార్టీ అధిష్ఠానవర్గాన్ని ఇరుకున పెట్టవద్దని ఆయన ఆయన సీనియర్లకు సూచించారు. అధిష్ఠానవర్గం అనుమతి ఉంటేనే తాను సభలో పాల్గొంటానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అధిష్ఠానవర్గం అనుమతి లేకుండా సభ పెట్టడం క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు సీనియర్లతో గొంతు కలుపుతూ వచ్చిన సర్వే సత్యనారాయణ సభ విషయంలో వారితో విభేదించారు.
తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గానికి స్పష్టత ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల సీనియర్లకు నిబద్ధత ఉందని, తనకు కూడా నిబద్ధత ఉందని, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ నిబద్ధత ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటు ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై సోనియా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications