కరీంనగర్ అభ్యర్థి జీవన్ రెడ్డే: రత్నాకర్ రావు
హైదరాబాద్: కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి రోడ్లు, భవనాల శాఖ మంత్రి జీవన్ రెడ్డే అవుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్ రావు అన్నారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మరోసారి గెలవకూడదని ఏమీ లేదని, జీవన్ రెడ్డికి మెరుగైన అవకాశాలున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కరీంనగర్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై పోటీ చేసి జీవన్ రెడ్డి ఓడిపోయారు. అయినా జీవన్ రెడ్డినే పోటీకి దించేందుకు పార్టీ అధిష్ఠానవర్గం ఆలోచిస్తోందని రత్నాకర్ రావు చెప్పారు.
తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమకు, తెరాసకు మధ్యనే పోటీ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ పోటీలో కూడా ఉండదని ఆయన అన్నారు. త్వరలో కరీంనగర్ జిల్లా మేడారంలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామిని పిలిచామని, వెంకటస్వామి సమావేశానికి వస్తానని చెప్పారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని రత్నాకర్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications
