రచ్చకెక్కిన చెంగా, గాలిల గొడవ
హైదరాబాద్: చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి ఆర్. చెంగారెడ్డికి, చిత్తూరు జిల్లా పుత్తూరు శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. చెంగారెడ్డిపై గాలి ముద్దుకృష్ణమనాయుడు బుదవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలోని రైల్వే వంతెనను మంత్రి చెంగారెడ్డి ఆపించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి, మంత్రికి చెప్పి దాన్ని ఆపించారని ఆయన అన్నారు. ఈ విషయంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సమక్షంలో మంత్రి ప్రమాణం చేయాలని, తాను కూడా చేస్తానని ఆయన చెప్పారు.
తాను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చానని గర్వంగా చెప్పుకుంటానని ఆయన చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో పేరుప్రతిష్టలు, మంత్రి పదవులు సంపాదించుకున్నానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచానని ఆయన చెప్పారు. తెలుగుదేశం కాంగ్రెసకుకు వచ్చినవాళ్లు శాసనసభ్యులుగా 50 మంది ఉన్నారని, పది మంది మంత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు. నగరిలో చెంగారెడ్డి ఓడిపోయే అభ్యర్థి అని, ఆ సీటు తనకు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానవర్గాన్ని అడుగుతానని, నగరి చెంగారెడ్డి సొంత సొత్తు కాదని ఆయన అన్నారు.
గాలి ముద్దుకృష్ణమనాయుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి చెంగారెడ్డి అన్నారు. గాలి ఆరోపణలపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయాన్నే తాను ముఖ్యమంత్రికి చెప్పానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications