సిఎం సభ వద్ద బాలుడి మృతి
కడప: కడప జిల్లా మైదుకూరులో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సభ వద్ద అనారోగ్యంతో ఒక బాలుడు మరణించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మైదుకూరులో ముఖ్యమంత్రి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి పెద్ద యెత్తున ప్రజలు కదిలి వచ్చారు. దాదాపు 12 వేల మంది రోగులు వచ్చారు. కడపకు చెందిన మనోహర్ అనే బాలుడిని కూడా తల్లిదండ్రులు ఈ వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడికి వైద్యులు ఆక్సిజన్ పెట్టారు. ఆ ఆక్సిజన్ ను తీసేయడంతో తమ కొడుకు మరణించాడని మనోహర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆ బాలుడి శవాన్ని తీసుకుని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సభా వేదిక వద్దకు వచ్చారు. అయితే నాయకులు, అధికారులు వారిని ముఖ్యమంత్రిని కలవనీయలేదు. దాదాపు పావు గంట సేపు శవాన్ని పెట్టుకుని వారు వేదిక వద్దే నించున్నారు. ప్రసంగం పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఇదేమీ చూడకుండానే వెళ్లిపోయారు. వైద్య శిబిరం వద్ద తొక్కిసలాటలాంటిది కూడా చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications