బాబర్ ఆజమ్ గ్రేట్ రిటర్న్: పాకిస్తాన్ క్రికెట్ కు పూర్వవైభవం
పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ లో మరోసారి కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ రిటర్న్ అయ్యాడు. తిరిగి టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్ వరుస పరాజయాలతో విఫలం కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ బాబర్ ఆజమ్ కే సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఈ నెల చివర్లో వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి బాబర్ నేతృత్వంలో పాక్ జట్టు బరిలోకి దిగనుంది.
చివరిసారిగా 2023లో టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించాడీ డాషింగ్ ఓపెనర్. ఇప్పుడు మళ్లీ అతన్నే నమ్ముకుంది పీసీబీ. షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు తీవ్ర పరాజయాలను చవిచూసింది. సుమారు మూడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన మసూద్.. ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. ఆయన కెప్టెన్సీలో పాకిస్తాన్ ఆడిన 16 టెస్టుల్లో ఏకంగా 12 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. పాక్ క్రికెట్ చరిత్రలో 10 కంటే ఎక్కువ టెస్టులకు సారథ్యం వహించిన కెప్టెన్లలో మిస్బా ఉల్ హక్ మాత్రమే మసూద్ కంటే ఎక్కువ పరాజయాలను చవిచూశాడు.

చివరి ఏడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో కేప్టెన్సీ మార్పు తప్పలేదు. మసూద్ నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో 3-0తో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్, ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో 2-0తో చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ చేతిలో పాక్‌కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ ఓటమి కావడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ విజయం మాత్రమే మసూద్ హయాంలో సానుకూల అంశంగా నిలిచింది.
ఈ పరాజయాల వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ చివరి స్థానానికి పడిపోయింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండటం, కెప్టెన్సీకి ఇతర అనుభవజ్ఞులైన ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో పీసీబీ మళ్లీ బాబర్ ఆజం వైపు మొగ్గు చూపింది. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత బాబర్ బ్యాటింగ్‌లో కొంత తడబడ్డారు. మసూద్ సారథ్యంలో టెస్ట్ క్రికెట్‌లో ఆయన బ్యాటింగ్ సగటు కేవలం 27గా మాత్రమే నమోదైంది.
అయినప్పటికీ.. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా బోర్డు ఆయనపైనే నమ్మకం ఉంచింది. గతంలో బాబర్ నేతృత్వంలో పాకిస్తాన్ 20 టెస్టుల్లో 10 విజయాలు సాధించడమే కాకుండా, ఆయన బ్యాటింగ్ సగటు 50గా ఉంది. కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం ముందు ఇప్పుడు భారీ సవాళ్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. సుమారు ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఆ తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications