కప్పట్రాళ్ల హత్య: గన్ మన్ పై అనుమానాలు
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్యలో ఆయన రెండో ఆంగరక్షకుడు వెంకటేశ్వర్లు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వర్లు గురువారం ఉన్నతాధికారుల వద్దకు వచ్చాడు. అయితే పిస్టల్ లేనిదే విధుల్లోకి తీసుకోబోమని ఉన్నతాధికారులు చెప్పారు. విధుల్లో ఉండాల్సిన వెంకటేశ్వర్లు హత్య జరిగిన రోజు కర్నూలులో ఉన్నాడు. దానికితోడు అతని 9 ఎంఎం పిస్టల్ హత్యా స్థలంలో దొరికింది.
తాను వ్యక్తిగత పనుల మీదే కర్నూలులో ఉన్నానని వెంకటేశ్వర్లు అంటున్నారు. అయితే వెంకటేశ్వర్లు కప్పట్రాళ్ల హత్యను ముందే పసిగట్టి తప్పుకున్నాడా, వ్యక్తిగత పనుల మీదనే కర్నూలులో ఉన్నాడా అనే విషయంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. కప్పట్రాళ్ల మరో అంగరక్షకుడు రాములు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కప్పట్రాళ్లకు రక్షణగా ఉండాల్సిన వెంకటేశ్వర్లు మాత్రం అక్కడ లేరు. వెంకటేశ్వర్లు పిస్టల్ ను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఈ విషయాన్ని పోలీసు సూపరింటిండెంటుకు తెలియజేశామని డిఎస్పీ రామనాథ్ అంటున్నారు. వెంకటేశ్వర్లుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications