బెంగుళూరు: మూడవ, ఆఖరి విడత ఎన్నికలు నేడు కర్నాటకలో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఉత్తర కర్నాటక లోని ఎనమిది జిల్లాల్లో (ధార్వాడ్, గడగ్, హవేరి, బీదర్, గుర్బర్గా, బీజాపూర్, బాగల్ కోడ్, బెల్గాం) ఉన్న 69 నియోజకవర్గాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతాయి. 43మహిళా అభ్యర్దులతో సహా మొత్తం 699 మంది అభ్యర్దుల భవిష్యత్తును 10.18 మిలియన్ల ఓటర్లు నేడు నిర్ణయించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్. ధరమ్ సింగ్, 'కెపిసిసి' అధ్యక్షుడు, మాజీ మంత్రి మల్లిఖార్జున ఖార్గె, శాసన మండలి మాజీ ప్రతిపక్ష నాయకుడు హెచ్.కె. పాటిల్, మాజీ మంత్రి గురుపాదప్ప నాగమరపల్లి, జగ్దీష్ శెట్టార్, సిఎం ఉదసి, గోవింద కార్జోల్ లు మూడో విడత ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన అభ్యర్దులు.ఎనమిది జిల్లాల్లో 12,389 పోలింగ్ స్టేషన్లు ఉండగా అందులో 4,358 గొడవలు జరగడానికి ఎక్కవ అవకాశం ఉన్నవిగా, 4,038 గొడవలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 56,000 పోలీసులను, 225 కంపెనీల పారా మిలిటరీ దళాల్ని దించి గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.బోగస్ ఓటింగ్ ను అరికట్టడానికి వందలమంది సునిశిత పరిశీలకులను కేంద్ర పరిశీలకులను కేంద్రం నుంచి రప్పించారు. మతపరంగా సున్నితమైన హుబ్లి, బెల్గాం జిల్లాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. 89 నియోజక వర్గాలకు మెదటి విడత ఎన్నికలు మే 10న, 66 నియోజక వర్గాలకు రెండవ విడత ఎన్నికలు మే 16 న ఇంతకు ముందే జరిగాయి. నేటి మూడవ విడత ఎన్నిక కూడా పూర్తయ్యాక మే 22న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.