సచివాలయంలో జర్నలిస్టులు బైఠాయింపు
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా జర్నలిస్టులు బుధవారంనాడు సచివాలయంలోని హోంమంత్రి కె. జానారెడ్డి కార్యాలయం ఎదురుగా బైఠాయించారు. కార్యాలయాల్లోకి వెళ్లకుండా వారు హోంమంత్రిని, పంచాయతీరాజ్ శాఖా మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. జర్నలిస్టులు సచివాలయమంతా కలియదిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్టయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు బుధవారంనాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభమై ట్యాంకుబండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు జరిగింది. జర్నలిస్టులు సచివాలయం వరకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications