వెళ్లిపోక నిందలెందుకు?: బాబు
రాజమండ్రి: పార్టీ నుంచి వెళ్లిపోతున్న నాయకులు ఇన్నాళ్లు పదవులు అనుభవించి తనపై నిందలు వేయడం సరి కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మీ కోసం యాత్ర చేస్తున్న ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లాలనుకునే నాయకులు వెళ్లిపోకుండా నిందలు వేయడం సరి కాదని ఆయన అన్నారు. ప్రథమ శ్రేణి నాయకులు వెళ్లిపోతే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అండగా నిలుస్తారని ఆయన అన్నారు.
పార్టీకి రాజీనామా చేస్తూ భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభానాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.భూమా నాగిరెడ్డి కుటుంబానికి తాను ఏం తక్కువ చేశానని ఆయన ప్రశ్నించారు. ఒకరిని ఎంపి చేశానని, మరొకరిని ఎమ్మెల్యే చేశానని, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చానని ఆయన అన్నారు. త్యాగాలు చేసిన కార్యకర్తలు బాగానే ఉన్నారని, పదవులు అనుభవించిన నాయకులే ఈ రోజు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు గౌరవం ఇచ్చామని, పదవులు ఇచ్చామని ఆయన అన్నారు. ప్రజలు కూడా పార్టీకి అండగా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications